- జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టన్నా పూర్తి చేసినవా?
- నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తానంటివి.. ఏమాయె?
- ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నవ్
- రోజా ఇంట్ల రొయ్యల పులుసు తిని.. నల్గొండను నాశనం చేసినవ్
- కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పిందే నువ్వు, నీ అల్లుడు
- అప్పుడు ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నరని ఫైర్
- కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని ప్రకటన
నల్గొండ, వెలుగు: నల్గొండలో కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానంటూ కేసీఆర్ ప్రగల్భాలు పలికి మాట తప్పారని, ఇప్పుడు నల్గొండకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు. ‘‘కేసీఆర్ ముక్కు నేలకు రాసి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలి” అని ఆయన డిమాండ్ చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్నా నల్గొండ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, పాలమూరును ఎండబెట్టారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ సహకరించి.. ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ‘‘వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి ఆ నాడు కేసీఆర్ పోయి రొయ్యల పులుసు తినుకుంట ‘రాయలసీమను రత్నాల సీమ’ చేస్తమన్నడు. మన నల్గొండను నాశనం చేసిండు” అని ఫైర్ అయ్యారు. ఆదివారం నల్గొండలో మీడియాతో మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ఈ నెల 13న కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు చేపడతామన్నారు.
కుర్చీ వేసి ఉంచుతం.. నువ్వు చేసిందేందో వచ్చి చెప్పు..!
నల్గొండ జిల్లాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ‘‘హరీశ్‌రావు, కేటీఆర్ పనికిరాని లీడర్లు. నల్గొండలోని చౌరస్తాలో ఒక కుర్చీ వేసి, ఒక పింక్ కలర్ టవల్ వేసి ఉంచుతం. ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తం.. జిల్లాలో ఏం అభివృద్ధి చేసినవో కేసీఆర్ వచ్చి చెప్పాలి? దళితుడిని సీఎంను చేస్తానని, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని, నల్గొండలో కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానని అప్పట్లో ప్రగల్బాలు పలికి మాట తప్పిన దుర్మార్గుడివి నువ్వు” అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ నీటి కేటాయింపులకు అంగీకరించి ఉమ్మడి నల్గొండను నట్టేట ముంచిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు.
‘‘బీఆర్ఎస్ మోసాలను గుర్తించే అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఓడగొట్టారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఇంకా వాళ్లు బుద్ధిరానట్టున్నది. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నడు. కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీశ్‌రావు. ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నరు” అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవికంగా ఉందని, విద్యారంగానికి పెద్ద పీట వేశామని ఆయన చెప్పారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేసేందుకు కేటాయింపులు చేశామన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.
రింగ్ రోడ్డు తోటే హైదరాబాద్ గేమ్ చేంజర్ గా మారుతుందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించామని అన్నారు. విద్యావ్యవస్థను గత బీఆర్ఎస్ సర్కార్ భ్రష్టుపట్టించిందని, యూనివర్సిటీలకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉండగా గుర్తుకురాని జ్యోతిరావు పూలే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు గుర్తుకురావడం ఏమిటని ప్రశ్నించారు.