నల్గొండ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతమనే భయంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తున్నదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండలో పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరానికి వెళ్లిన సంఘీభా వం తెలిపారు. తర్వాత మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం దండగ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు.
పంచాయతీ కార్మికులు వంద రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర సమస్యలు పక్కనపెట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పార్టీ మీటింగ్లు పెడుతుండన్నారు. ఫ్లైట్ కోసం రూ.కోటి ఖర్చు పెడుతున్న కేసీఆర్ కార్మికుల సమస్యల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బంద్ అయ్యే టైమ్ వచ్చిందని, అందుకే బంధుల పేరుతో స్కీంలు పెడుతున్నారని విమర్శించారు.
పదేండ్ల నుంచి బీసీల గురించి పట్టించుకోని సీఎంకు ఎన్నికలు దగ్గరపడే సరికి వారిపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ఇంకో వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, అప్పుడు కార్మికుల సంక్షేమంతోపాటు, ఆరోగ్య శ్రీ పథకంలో వెయ్యి రూపాయాల ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు.