- కరెంట్ లాగ్ బుక్కులు గుంజుకపోయిన్రు
- బండారం బయటపడ్తదనే హైదరాబాద్‌కు తీస్కపోయిన్రు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- వ్యవసాయానికి 11 గంటలకు మించి కరెంట్ ఇస్తలేరు
- కేటీఆర్.. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటవ్? అని ఫైర్
నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయానికి 11 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అది తాను రుజువు చేస్తానని సవాల్ విసరడంతో నల్గొండ జిల్లాలోని 350 సబ్స్టేషన్ల నుంచి లాగ్ బుక్స్‌ను హైదరాబాద్‌కు గుంజుకపోయారని ఆరోపించారు. ‘‘ప్రతి సబ్ స్టేషన్‌లోని లాగ్ బుక్‌ను పరిశీలిస్తే వ్యవసాయానికి ఏ రోజు? ఎన్ని గంటల కరెంట్ ఇచ్చారో తెలుస్తది. అలాగైతే తమ బండారం బయటపడ్తదని భయపడ్డ సర్కార్.. వాటిని సబ్ స్టేషన్ల నుంచి మాయం చేసింది” అని మండిపడ్డారు. శుక్రవారం నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘సాగుకు 24 గంటల కరెంట్ఇస్తున్నామని చెబుతున్నదంతా ఉత్తదేనని నేను నిరూపించడంతో కేటీఆర్ పరేషాన్లో పడ్డడు. ఆయనకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. 24 గంటల కరెంట్ ఇవ్వడం వాళ్లకు చేతకావడం లేదు” అని అన్నారు.
హిమాన్షును చూసైనా కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధి రావాలె..
రేవంత్ అమెరికాలో మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నాయకులు ముక్కలు ముక్కలుగా కట్ చేసి తప్పులు తీస్తున్నారని వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ నేతలు తిన్నది అరగక రోడ్ల మీద ధర్నాలు చేశారు. హైదరాబాద్‌లో కవిత రోడ్డు మీద ధర్నా చేస్తే, 6 గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని కేటీఆర్, ఆయన బంధువులు, ఎమ్మెల్యేలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణలో స్కూళ్ల దుస్థితిపై హిమాన్షు నిజాలు మాట్లాడి తన తాతకు, తండ్రికి బుద్ధి చెప్పాడు. సర్కార్ బడుల పరిస్థితిపై హిమాన్షు కన్నీళ్లు పెట్టుకున్నడు. ఇది చూసైనా విద్యాసంస్థల్లో ప్రభుత్వం సౌలతులు కల్పించాలి” అని అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో జరగనున్న ప్రియాంక గాంధీ సభలో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు.