వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ అర్బన్‌, వెలుగు  : వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ఈ విషయంలో ఎవరికి అనుమానాలు అవసరం లేదని భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబీబీఎస్​ సీట్లు సాధించిన భాషపాక కళ్యాణి, కొరివి మహేశ్, చెరుపల్లి నిహారికలకు రూ.1.30 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఒక్కొక్కరికీ రూ.75వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 28మంది విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు.

దళిత బంధు పథకాన్ని డ్రా తీసి ఎంపిక చేయాలని, అలాకాకుండా టీఆర్ఎస్​పార్టీ వాళ్లకే ఇస్తామంటే న్యాయపోరాటం చేస్తామన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని విలువైన ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీసులు కడుతున్నారని, వెంకటేశ్వర కాలనీలో రూ.100 కోట్ల విలువైన ప్రజా ఆస్తిలో పార్టీ ఆఫీస్ కట్టారన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక పార్టీ ఆఫీస్ మార్పిస్తానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడనని, ఎన్నికలకు నెల రోజుల ముందే మాట్లాడతానన్నారు. తన మీద ఇంకా కాంగ్రెస్ కండువే ఉందన్నారు. జనవరి నుంచి రెగ్యులర్ గా నల్గొండలో పర్యటిస్తానన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సహాయం అడిగితే గేటు బయట నుంచి తరిమేస్తున్నారని ప్రజలందరూ తనకే ఫోన్ చేస్తున్నారన్నారు. నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్​రెడ్డి, పాల్గొన్నారు.