రాష్ట్ర కాంగ్రెస్ లో మరోసారి వర్గ పోరు బయటపడింది. హనుమకొండలో మే 6న రైతు సంఘర్షణ బహిరంగ సభకు రాహుల్ రానున్నారు. ఈ సభకు జన సమీకరణ, మీటింగ్ ను సక్సెస్ చేసేందుకు జిల్లాల్లో సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ నల్గొండ జిల్లాకు వెళ్తున్నారు రేవంత్. ఇంత వరకు బానే ఉన్నా... రేవంత్ నల్గొండ టూర్ ను వ్యతిరేకించారు ఆ జిల్లా సీనియర్ నేతలు. ముందు నల్గొండ టౌన్లోనే సన్నాహక సదస్సు నిర్ణయించింది పీసీసీ. భువనగిరి ఎంపీ, పీసీసీ క్యాంపెయిన్ స్టార్ కోమటిరెడ్డితో పాటు మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో సన్నాహక సదస్సు అవసరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. అటు రేవంత్ వర్గం కూడా అన్ని జిల్లాల తరహాలోనే నల్గొండలోనే సన్నాహక సదస్సు నిర్వహిస్తామని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ నల్గొండ లో పర్యటిస్తారని డీసీసీకి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సిచ్చువేషన్లో సీనియర్ నేత, మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి జోక్యం చేసుకొని... నల్గొండలో కాకుండా తన సొంత నియోజకవర్గం నాగార్జున్ సాగర్ లో సన్నాహక సదస్సు ఏర్పాటు చేయించారు.
సాగర్ లో సీనియర్ లీడర్ జానారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రేవంత్ మీటింగ్ కు వెళ్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి మాత్రం తగ్గేదేలేదంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాగర్ సన్నాహక సదస్సుకు వెళ్లనని ఖరాకండిగా తేల్చిచెప్పారు ఎంపీ కోమటిరెడ్డి. నిర్వహించాల్సింది నల్గొండలో కాదు... పార్టీ వీక్ గా ఉన్న జిల్లాల్లో అని తేల్చి చెప్పారు. నల్గొండలో హేమా హేమీ లీడర్లు ఉన్నారని... నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో తమకు ఒక్క సర్పంచ్ కూడా లేడని... అక్కడ పార్టీపై దృష్టి పెట్టాలని పరోక్షంగా విమర్శలు చేశారు. రాహుల్ సభ సక్సెస్ పై తాను దృష్టి పెట్టినట్లు తెలిపారు. అవసరమైతే రేవంత్ సభకు తమ వాళ్లను పంపిస్తున్నానన్నారు.