ఈఆర్సీ చైర్మన్‌ను కలవడం పెద్ద జోక్: మంత్రి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ చార్జీలు పెంచొద్దంటూ టీజీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావును కేటీఆర్ కలవడం పెద్ద జోక్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేటీఆర్.. ఓ జోకర్ అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. పదేండ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ సర్కార్.. రూ.25వేల కోట్లతో మూసీని ఎందుకు సుందరీకరించలేదని ప్రశ్నించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై కేటీఆర్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కల్పించింది. దీపావళి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 4వేల ఇండ్లను మంజూరు చేస్తున్నం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారు? ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే బీఆర్ఎస్ నేతల జాతకాలు బయటికి వస్తాయి.
టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీస్కుంటం. కేటీఆర్, హరీశ్ రావు అమెరికా వెళ్లి.. ఇండియాకు రావొద్దని ప్రభాకర్‌రావుకు చెప్పిన్రు”వెంకట్ రెడ్డి అన్నారు. లుకౌట్ నోటీసులివ్వాలని కేంద్ర హోంశాఖను కోరితే.. ఇప్పటిదాకా స్పందించలేదని తెలిపారు. ప్రభాకర్ రావు.. ఎప్పటికైనా ఇండియాకు రావాల్సిందే అని, ఆయన వచ్చాక వీళ్ల ఆగడాలు సాగవని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును డైవర్ట్ చేసేందుకే ప్రభుత్వం, మంత్రులపై కేటీఆర్, హరీశ్ నిత్యం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటూ గెల్వదని జోస్యం చెప్పారు.