12వ బెటలియన్‌‌ సమస్యలను పరిష్కరిస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

  • రూ. 70 లక్షలతో రోడ్ల నిర్మాణం 

నల్గొండ అర్బన్ , వెలుగు: 12 వ బెటలియన్  సమస్యలను పరిష్కరిస్తానని  ఆర్‌‌‌‌అండ్‌‌బీ, సినిమాటోగ్రఫీ- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలోని 12 బెటాలియన్‌‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పోలీసు అధికారులు మంత్రికి గౌరవవందనం చేసి స్వాగతం పలికారు.  అనంతరం ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఉత్కృష్ట సేవ, కఠిన సేవ, ఉత్తమ సేవ పతకాలు,  ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  పోలీసులు సెలవు లేకుండా ప్రజలకోసం నిరంతరం పనిచేస్తారని, వారి కుటుంబాలు బాగుండాలన్నారు.

 మంత్రిగా కాకుండా ఒక స్నేహితునిగా అందరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. బెటాలియన్ పరిధిలో ఉన్న రోడ్డు సమస్యల గురించి అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. వెంటనే రూ.70 లక్షలు మంజూరు చేశారు.  నెల రోజుల్లో రోడ్డు పనులను ప్రారంభిస్తానని ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో కమాండెంట్ ఎన్‌‌వీ సత్యశ్రీనివాస్, అడిషనల్ కమాండెంట్‌‌ తిరుపతి, చంద్రశేఖర్, ఉదయభాస్కర్ పాల్గొన్నారు.