- అక్టోబర్లో శంకుస్థాపన.. డిసెంబర్లో పనులు: మంత్రి వెంకట్రెడ్డి
- పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రాజెక్టు.. రైతులకు అన్యాయం చెయ్యం
- ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామని వెల్లడి
- గత ప్రభుత్వం పదేండ్లుగా రోడ్ల రిపేర్లు చేయలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) నార్త్ ఫేజ్ ప్రాజెక్టును మూడున్నరేండ్లలో పూర్తి చేస్తామని ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దీనికి అక్టోబర్ లో శంకుస్థాపన చేసి, డిసెంబర్ లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘పాత అలైన్ మెంట్ ప్రకారమే పనులు చేపడుతున్నాం. అలైన్ మెంట్ మార్చాలని కొందరు రైతులు నన్ను కలిశారు. వారికి అన్యాయం జరగకుండా చూస్తాం” అని అన్నారు. బుధవారం సెక్రటేరియెట్ లో ఆర్అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ర్ట్ంలో రోడ్ల నిర్మాణం, నేషనల్ హైవేల విస్తరణ, ట్రిపుల్ ఆర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం, అంబర్ పేట, ఉప్పల్ ఫ్లైఓవర్లు, శామీర్ పేట ఎలివేటెడ్ హైవే తదితర పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే ట్రిపుల్ ఆర్ పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. ‘‘కేంద్రంతో కేసీఆర్ లొల్లి పెట్టుకుని నిధులు వద్దు అన్నారు. ఈ లొల్లి లేకపోతే ప్రాజెక్టు సగం పూర్తయ్యేది. యుటిలిటీ చార్జీల అంశంలో అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ రూ.400 కోట్లు కట్టమని కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ప్రాజెక్టు రద్దు చేస్తామని ఎన్ హెచ్ఏఐ చైర్మన్ లేఖ రాశారు. మా ప్రభుత్వం అధికారంలో రాగానే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించగా, కేంద్రమే ఆ నిధులను చెల్లిస్తుందని ఆయన ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు స్పీడప్ అయింది” అని తెలిపారు. వరంగల్ తో పాటు హైదరాబాద్ లో నిర్మిస్తున్న నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. దీనిపై త్వరలో హెల్త్ మినిస్టర్ తో సమావేశమవుతానని చెప్పారు. ‘‘ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ కొత్త బిల్డింగ్ నిర్మాణంపై సిటీ ఎమ్మెల్యేలతో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తాం” అని తెలిపారు. బేగంపేటలోని పాటిగడ్డలో హైదరాబాద్ కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మిస్తున్నామన్నారు.
త్వరలో హైవేల విస్తరణ..
హైదరాబాద్–విజయవాడ హైవేపై రోజురోజుకు రద్దీ పెరుగుతున్నదని కోమటిరెడ్డి చెప్పారు. ‘‘దీన్ని డెత్ రోడ్ అని గడ్కరీ చాలాసార్లు నాతో అన్నారు. ఈ హైవేలో ఎక్కువ ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లు గుర్తించాం. వీటికి రూ.375 కోట్లతో రిపేర్లు చేయిస్తున్నాం. ఈ నెల 23న పనులు మొదలుపెడతాం. ఈ హైవేను 6 లేన్లుగా విస్తరించాల్సి ఉన్నా జీఎంఆర్ వల్ల ఆగింది. టెండర్లు పిలుస్తామంటే కోర్టుకు వెళ్తున్నారు” అని అన్నారు. రూ.5,600 కోట్లతో హైదరాబాద్–బెంగళూరు హైవేను విస్తరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లోని ఉప్పల్, అంబర్ పేట్ ఫ్లైఓవర్లు, పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామని చెప్పారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా త్వరగా చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. కేటీఆర్ సెల్ఫీలు దిగడానికే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పూర్తి చేశారని, మూసీ ప్రక్షాళనను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
రెండేండ్లలో హైకోర్టు కొత్త బిల్డింగ్..
శామీర్ పేట ఎలివేటేడ్ హైవే పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని కోమటిరెడ్డి తెలిపారు. ‘‘హైకోర్టుకు కొత్త బిల్డింగ్ ను రెండేండ్లలో నిర్మిస్తాం. త్వరలో డిజైన్ పూర్తవుతుంది. ఆ తర్వాత టెండర్లు పిలుస్తాం. గత పదేండ్లుగా రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు జరగలేదు. మేం వచ్చాక మరమ్మతులు చేయిస్తున్నాం. కల్వకుర్తి–-కొల్లపూర్ ను కలిపేలా కృష్ణానదిపై నిర్మిస్తున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి పనులకు టెండర్ ప్రక్రియ నడుస్తున్నది” అని చెప్పారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో కనెక్టివిటి కోసం రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా ప్లాన్స్ రూపొందిస్తున్నామని వెల్లడించారు.
25న ఢిల్లీకి వెళ్త..
ఈ నెల 25, 26న ఢిల్లీలో పర్యటిస్తానని.. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఫారెస్ట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ను కలుస్తానని కోమటిరెడ్డి తెలిపారు. నేషనల్ హైవేల విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నేషనల్ హైవేల విస్తరణలో ఫారెస్ట్ వివాదాల పరిష్కారం, అనుమతులు తదితర అంశాలపై చర్చిస్తామని చెప్పారు. హైదరాబాద్–విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. త్వరలో రెండు రాష్ర్టాల సీఎంలు సమావేశమై, దీనిపై ప్రధానిని కలుస్తారు” అని వెల్లడించారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు.