కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీని ఆయన ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీశారు. రేవంత్ ఎవరినీ సంప్రదించకుండా చెరుకు సుధాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. పాత టీడీపీ వాళ్లందరినీ రేవంత్ కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాసోజు శ్రవణ్ ఎందుకు పార్టీ వీడాల్సి వస్తోందని ప్రశ్నించిన ఆయన.. రేవంత్ వ్యవహరిస్తున్న తీరు గురించి సోనియా, రాహుల్ గాంధీ వద్ద తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
మునుగోడులో కాంగ్రెస్ సభ నిర్వహించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనకు ఈ రోజు పార్లమెంటులో మూడు క్వశ్చన్లు ఉన్నాయని, తాను రాలేనని తెలిసే మునుగోడులో సభ ఏర్పాటు చేశారని ఆరోపించారు. లోకల్ ఎంపీనైన తనను సంప్రదించకుండా మునుగోడులో సభ ఎలా పెడతారని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు తెలుసన్న వెంకట్ రెడ్డి.. హుజూరాబాద్ విషయంలో రేవంత్ ఎందుకు ఇలా రియాక్ట్ అవలేదని అన్నారు.
అంతకు ముందు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన వరద నష్టంపై చర్చించారు. వరదల కారణంగా దాదాపు రూ.1400 కోట్ల నష్టం జరిగిందని, తెలంగాణలో ఏరియల్ సర్వే చేయించాలని కోరినట్లు వెంకట్ రెడ్డి చెప్పారు.