న్యూఢిల్లీ: ఏఐసీసీ ఆఫీసు నుంచి అందిన పిలుపు మేరకు పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరికాసేపట్లో ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు భేటీ జరగనున్నట్లు సమాచారం. ముందుగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ తర్వాత ప్రియాంక గాంధీతో సమావేశం జరగనుంది. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలను, అలాగే తనను రేవంత్ వర్గం టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని వెంకట్ రెడ్డి కంప్లైంట్ చేస్తారని తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో వెంకటరెడ్డికి మధ్య నెలకొన్న విబేధాలు ఇతర అంశాలపై భేటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తనను విమర్శించిన పార్టీ సొంత పార్టీ నేతలను పార్టీ బహిష్కరించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ నిర్వహించిన సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు. అనుమతి తీసుకునే దూరంగా ఉన్నట్లు వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆయనతో ప్రియాంక గాంధీ భేటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో సేవలు అందించిన తాను కొంత కాలంగా కొందరి తీరుతో అవమానాలకు గురవుతున్నానని పేర్కొన్నారు. తనకు ఇష్టం లేకున్నా..రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించానని, కాంగ్రెస్ అభ్యున్నతికి పాటుపడ్డానని వెంకట్రెడ్డి చెప్పారు. మనస్తాపంతో అలిగి దూరంగా ఉన్న వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6.30 గంటలకు ప్రియాంకతో వెంకట్ రెడ్డి భేటీపై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.