మోదీ మన లెక్కలోనే లేరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 ప్రధాని నరేంద్ర మోదీ తమ లెక్కలోనే లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని..  రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.   జానా రెడ్డి అదృష్ట వంతుడుని.. ఒక కొడుకు ఎమ్మెల్యే  .. మరో కొడుకు భారీ మెజార్టీతో ఎంపీగా గెలువబోతున్నారని చెప్పారు. 

బీఆర్ఎస్  మోసాన్ని గ్రహించి కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ కు స్వాగతమన్నారు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండబోరన్నారు.  పదేళ్లలో లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్  ను ఓడించారని విమర్శించారు.

తనను  గల్లీ నుంచి  ఢిల్లీకి పంపిన  కార్యకర్తలకు తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  నాలుగు నెలల్లో వెయ్యి కోట్ల నిధులు తెచ్చానని చెప్పారు.  రూ. 700 కోట్లతో నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుందని చెప్పారు.  గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుకో వాలింటరీ వ్యవస్థ రాబోతుందన్నారు.  ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రెండు వందల ఎకరాల్లో పది వేల ఇళ్లు కడుతున్నామని చెప్పారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో  తన  సొంత డబ్బులతో 35 ఏసీలు పెట్టించానని తెలిపారు.  ఆగస్ట్  పదిహేను లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్దమేనని చెప్పారు కోమటిరెడ్డి.