- సమస్యలపై అసెంబ్లీలో మొత్తుకున్నా సీఎం స్పందించలే
- అందుకే రాజీనామా చేసి మీ ముందుకు వచ్చిన
- ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్ ను మునుగోడుకు గుంజుకొచ్చిన
- బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉద్యమించాలని పిలుపు
చండూరు/మునుగోడు, వెలుగు:
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలిచ్చే తీర్పు కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తున్నదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ‘‘మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన అంతం కావాలి” అని పేర్కొన్నారు. నాంపల్లి మండల కేంద్రం నుంచి చండూరు వరకు మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చండూరులో జరిగిన రోడ్ షో లో బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
మునుగోడులోని తన క్యాంపు ఆఫీసులో మీడియాతోనూ మాట్లాడారు. ‘‘మునుగోడు అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం నేను అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా ఈ టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. అందుకే రాజీనామా చేసి ఉప ఎన్నికలో ప్రజల ముందుకొచ్చిన. ఫాంహౌస్‌లో పడుకున్న కేసీఆర్ ను మునుగోడుకు గుంజుకొచ్చిన” అని చెప్పారు. కేసీఆర్ కుటుంబం నియంత పాలన సాగిస్తున్నదని, లక్షల కోట్లు దోచుకున్నదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందన్నారు. కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కించడం బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ‘‘నేను ప్రచారం చేస్తే అడ్డుకుంటున్నరు.. రాళ్ల దాడి చేస్తున్నరు.. మా కార్యకర్తలను బెదిరిస్తున్నరు.. కేసులు పెడతామని భయపెట్టి గులాబీ కండువా కప్పేందుకు ప్రయత్నిస్తున్నరు’’ అని మండిపడ్డారు. లిక్కర్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నదని, సీబీఐ కూడా వస్తుందని, విచారణను కేసీఆర్అడ్డుకోలేరని అన్నారు. ‘‘కూసుకుంట్ల ఓ దద్దమ్మ. ఓ బానిస’’ అని ఆయన విమర్శించారు.
పాలనను గాలికి వదిలేసిండు
మునుగోడు ఎన్నిక కేవలం పార్టీల మధ్య పోరు కాదని, తెలంగాణ భవిష్యత్ కోసం జరుగుతున్న పోరాటమని రాజగోపాల్ అన్నారు. ‘‘ఒకప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. కేసీఆర్కారణంగా అప్పులుపాలైంది. పాలనను గాలికి వదిలేయడంతో విద్య, వైద్య లాంటి ముఖ్యమైన రంగాలు కూడా ఆగం పట్టినయ్. కేసీఆర్‌మాత్రం ఊరూరా బెల్ట్ షాపులను పెట్టించి ప్రజలను తాగుడుకు బానిసలుగా మారుస్తున్నడు. ఇప్పటికైనా మహిళలంతా కలిసి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రావణ రాజ్యానికి సమాధిరాయి పడాలి: సంజయ్
మునుగోడు ఉప ఎన్నిక వాయిదా పడాలని టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ‘‘ఓడిపోతామన్న భయంతోనే దాడులకు దిగుతున్నరు. రాష్ట్రంలో రావణ రాజ్యానికి మునుగోడు ఎన్నిక సమాధిరాయి కాబోతున్నది. రామరాజ్యం స్థాపనకు పునాది రాయి పడబోతున్నది” అని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు మునుగోడు ప్రజల చేతుల్లో ఉందని తెలిపారు. మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.