- రెండు సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయంపై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్
- మంత్రి వెంకట్‌రెడ్డికి ఛాలెంజింగ్‌గా మారిన సికింద్రాబాద్
- సెగ్మెంట్ పరిధిలో అందరూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతో ఫుల్ ఫోకస్
- భువనగిరిలో దూకుడు పెంచిన రాజగోపాల్‌రెడ్డి
నల్గొండ, వెలుగు: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సరికొత్త ఛాలెంజ్ ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ సెగ్మెంట్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి నియోజకవర్గానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇన్‌చార్జులుగా నియామకం అయ్యారు. ఈ రెండు సెగ్మెంట్లలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొనడంతో వారిద్దరూ కాంగ్రెస్ క్యాండిడేట్ల విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నారు.
సికింద్రాబాద్‌పై ఫుల్ ఫోకస్
సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్క ప్లేస్‌లో కూడా కాంగ్రెస్ఎమ్మెల్యే గెలవలేదు. దీంతో ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌ను కాంగ్రెస్ ఛాలెంజింగ్ తీసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో ఉండగా, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి మాజీమంత్రి పద్మారావు గౌడ్ పోటీలో ఉండడంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో ట్రయాంగిల్ వార్ జరుగుతున్న స్థానాల్లో సికింద్రాబాద్ కూడా ఒకటి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఈ సెగ్మెంట్ బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అప్పగించింది. వెంకట్‌రెడ్డి ఇప్పటివరకు భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌కు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ అనివార్య పరిస్థితుల్లో భువనగిరి బాధ్యతను వదులుకోవాల్సి వచ్చింది.
ఆపరేషన్ స్టార్ట్...
సికింద్రాబాద్ ఎన్నికల ఆపరేషన్‌ను మంత్రి వెంకట్‌రెడ్డి స్పీడప్ చేశారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్, ముషీరాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లో నిలువగా, అంబర్‌పేట, సనత్‌నగర్‌లో థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది. ఈ రెండు చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి 2,29,898 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో రెండు వేల ఓట్ల నుంచి 22 వేల ఓట్ల తేడాతో కాంగ్రెడ్ క్యాండిడేట్లు ఓడిపోగా, మిగిలిన చోట్ల మెజార్టీకి చాలా దూరంలో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇటీవల మంత్రి వెంకట్‌రెడ్డి రివ్యూ చేశారు. ఫలితాలను విశ్లేషించిన లోపాలను అడిగి తెలుసుకున్నారు. భువనగిరి సెగ్మెంట్‌లో జనగామ మినహా మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నందున భువనగిరి టాస్క్ ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు సికింద్రాబాద్‌లో అందరూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే కావడంతో ఈ స్థానం మంత్రికి ఛాలెంజింగ్‌గా మారింది.
భువనగిరిలో స్పీడ్ పెంచిన రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గ పరిధిలో జనగామ మినహా మిగిలిన ఆరు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో విజయం ఈజీ కానుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ అయిన రాజగోపాల్‌రెడ్డికి అన్ని నియోజకవర్గాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వచ్చి భువనగిరి బాధ్యతలు అప్పగించడంతో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
పార్లమెంట్ పరిధిలో ఈ సారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని రాజగోపాల్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు. మరో వైపు ఈ స్థానంలో బీసీ సెంటిమెంట్ కూడా మారుమ్రోగుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ గౌడ, కురమ సామాజికవర్గానికి చెందిన వారికి చెందిన వారికి టికెట్లు ఇవ్వగా నియోజకవర్గంలో ఆయా వర్గ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అయితే 2009 నుంచీ ఇదే రకమైన ప్రయోగం జరుగుతున్నా 2014లో మాత్రమే బీసీ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న బూర నర్సయ్యగౌడ్‌ను తప్పిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్ క్యాండిడేట్ క్యామ మల్లేశ్ ఇద్దరూ కొత్తవారే. రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంలో సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటు జనగామలో తల్లి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పైగా కిరణ్ నామినేషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకావడంతో పాటు, ప్రచారానికి ప్రియాంక, రాహుల్ గాంధీలు సైతం హాజరవుతారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇవన్నీ కాంగ్రెస్‌కు కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు.