- రూ.422 కోట్లతో 17 బ్లాక్ స్పాట్లను బాగుచేస్తున్నం
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ – విజయవాడ హైవే ఎన్ హెచ్ 65ను సేఫ్ రోడ్ గా మారుస్తామని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ హైవే పై ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వాటి రిపేర్లకు రూ. 422.12 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆ హైవేను ఆరు లైన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేసేందుకు కన్సల్టెంట్లను నియమిస్తామని, అందుకోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని వెల్లడించారు.
సోమవారం సెక్రటేరియెట్ లో ఆర్ అండ్ బీపై మంత్రి వెంకట్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. మన్నెగూడ హైవే నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టేందుకు అపాయింటెడ్ డేట్ ను ఈ వారంలో ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. పనులు మొదలుపెట్టేందుకు కొన్నిచోట్ల ఇబ్బందిగా మారినా.. అటవీ అనుమతులు వచ్చాయని, హైవే విస్తరణకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
నాగ్ పూర్ – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, అపాయింటెడ్ డేట్ వచ్చేలోగా పెండింగ్ లో ఉన్న భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ కు కావాల్సిన 1941.65 హెక్టార్ల భూసేకరణ దాదాపు పూర్తయ్యిందని మంత్రి వివరించారు.