మునగోడులో తన గెలుపు నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేశారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు తనను గెలిపించుకోవడం కోసం పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలందరిని కలుపుకొని పోతానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో తానే స్వయంగా ప్రచారం చేస్తానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడం తన లక్ష్యమని చెప్పారు. తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తుందని చెప్పుకొచ్చారు.
తాను అనుకున్నట్లుగా బీజేపీ లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు అభివృద్ధి కోసం పనిచేస్తే ముఖ్యమంత్రి సహకరించలేదన్న రాజగోపాల్ .. తన రాజీనామా తో కదిలి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిందని చెప్పారు.
ఎమ్మెల్యే పదవి పోయిన పర్వాలేదు ప్రజలకు న్యాయం జరిగిందని, అది తనకు సంతోషంగా ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఉపఎన్నికతో ఆర్థికంగా నష్టపోయాను కానీ.. తన ప్రజల కోసమే అని భరిస్తూ ముందుకు సాగుతానని చెప్పారు.