తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకెళ్లక తప్పదన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందుకు సీఎం కేసీఆర్ మినహాయింపు కాదని చెప్పారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమన్నారు. అవినీతికి పాల్పడిన మనీష్ సిసోడియా జైలు పాలు అయ్యాడని గుర్తుచేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న కోమటిరెడ్డి.. ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తామని తెలిపారు. దేశ అభివృద్ధి, సమగ్రత, రక్షణ.. ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా నాయకత్వంతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. బీజేపీని చూస్తే బీఆర్ఎస్ వాళ్లకు వణుకు పుడుతుందని, అందుకే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ ప్రచారం చేస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్ లో పడొద్దంటూ సూచించారు.
బీజేపీని అధికారంలో కూర్చోబెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి కు బీ టీమ్ గా ఉందని, ఆ రెండు పార్టీలు విపక్షంలోనే కూర్చోబోతున్నాయని చెప్పారు.