ఇంత దుర్మార్గమైన పోలీసులను ఇంతవరకు చూడలే: రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మెజారిటీ తగ్గొచ్చేమో గానీ గెలుపు మాత్రం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ అనంతరం మునుగోడు క్యాంప్ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. తనను ఓడించడానికి నెల రోజుల పాటు  కేసీఆర్ ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేశారని ఆరోపించారు. మునుగోడులో100 మంది ఎమ్మెల్యేలను మోహరించి డబ్బు, మద్యం పంచారని మండిపడ్డారు. వాళ్లకు తోడు రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం కేసీఆర్ కు సహకరించిందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. పోలీసులు కేసీఆర్ కు అమ్ముడు పోయారని, ఇంత దుర్మార్గమైన పోలీసులను తానింత వరకు చూడలేదని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని, పోలీసులు తమ యూనిఫాం తీసేసి టీఆర్ఎస్ కండువాలు వేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా

ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాను కేసీఆర్ తెర మీదకు తెచ్చారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఆల్రెడీ అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఆడిన ఫాంహౌజ్ డ్రామా ప్రజలకు అర్థమైందని చెప్పారు. ప్రజలకు ఏం చేశారో చెప్పడానికి కేసీఆర్ వద్ద ఏం లేకే ఈ డ్రామా ఆడారని స్పష్టం చేశారు. ఓట్లు కొల్లగొట్టేందుకు ఓటర్లకు విపరీతంగా మద్యం తాగించి.. వాళ్ల ప్రాణాలతో ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. తన గెలుపు కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 6వ తేదీన వచ్చే ఫలితాల్లో తాను విజయం సాధించబోతున్నానని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.