మునుగోడు, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన నియోజకవర్గ జర్నలిస్టుల ఆత్మీయ సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం చేతిలో బందీ అయ్యిందని వాపోయారు. కుటుంబ పాలన అంతానికి తాను పోరాటం చేస్తున్నానని, ఇందుకోసం ప్రతి జర్నలిస్టు సహకరించాలని కోరారు.
రాష్ట్ర సాధన కోసం సొంత పార్టీని ఎదిరించి పార్లమెంటులో పోరాటం చేశామని గుర్తుచేశారు. యువకుల ఆత్మ బలిదానాలు, సొంత పార్టీ ఎంపీల పోరాటాలకు స్పందించిన సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని స్పష్టం చేశారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని ఇస్తే.. సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చాడని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారికి ఎన్నోహామీలు ఇచ్చిన కేసీఆర్ అధికారంలో రాగానే మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్‌ను గద్దె దించకపోతే జర్నలిస్టులకే కాదు.. అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, నాయకులు అనంత స్వామి, జర్నలిస్టులు ఉన్నారు.
Also Read:-సీతక్క వర్సెస్ పోచంపల్లి..ప్రచారంలో గుట్టు విప్పుకుంటున్న నేతలు