సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్నడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో తనను ఓడించడం కేసీఆర్ తరం కాదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. సంతలో పశువుల్లా కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. చిరుమర్తి లింగయ్య 20 కోట్ల రూపాయలకు కేసీఆర్ కు అమ్ముడుపోయారని, అలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. కేసీఆర్ కు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాదు గానీ.. ప్రతి గ్రామానికి 20కి పైగా బెల్ట్ షాపులు ఇవ్వడం వచ్చని ఎద్దేవా చేశారు. తాను బీజేపీకి అమ్ముడు పోయినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని కేసీఆర్, కేటీఆర్ కు సవాల్ విసిరారు. అమ్ముడు పోవాల్సిన అవసరం తనకు లేదని,  తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్ తన దగ్గర నుంచి డబ్బు తీసుకెళ్లారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల కోసమే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.

తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు మునుగోడు గురించి పట్టించుకోని కేసీఆర్... తన రాజీనామాతో దిగొచ్చారన్నారు. మూడున్నరేళ్లలో పెండింగ్ లో ఉన్న పనులు తన రాజీనామాతో వేగంగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. వంద మంది ఎమ్మెల్యేలతో ఊరూరా ప్రచారం చేయిస్తూ తనను ఓడించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని, అయితే అది అంత తేలిక కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు తన వెంటే ఉన్నారని, తనను గెలిపించి కేసీఆర్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తారని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.