చండూరు, వెలుగు: కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకతీతంగా బహిష్కరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డితో ఫ్రెండ్ షిప్ చేసి కేఆర్‌ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పజెప్పలేదా అని ప్రశ్నించారు.
10 సంవత్సరాల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నల్లగొండకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి దిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలో ఇప్పటికీ కేసీఆర్‌కు క్లారిటీ లేదన్నారు. నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది బీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డినే అని విమర్శించారు.
కేసీఆర్‌కు సిగ్గు ఉంటే ఇప్పటికైనా రాజకీయాల నుంచి రిటైర్డ్ కావాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ కుంభ శ్రీనివాస్ రెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, ఎంపీటీసీ పల్లె వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేశ్ యాదవ్, కలిమికొండ జనార్ధన్, నల్లగంటి మల్లేశ్, భీమనపల్లి శేఖర్ పాల్గొన్నారు.