కాంగ్రెస్ నాయకుల్లారా బీజేపీలోకి రండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాయకులారా బీజేపీలోకి రండి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి కింద పనిచేయడం కంటే రాజకీయమే మానేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడినప్పుడు ఎవరూ నమ్మలేదని.. ఇప్పుడు ఆలోచిస్తున్నారని చెప్పారు. డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకుండు అని రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిలోని గాంధీజీ విద్యాలయంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేసీఆర్ అవినీతి బయటకు తీయాలంటే బీజేపీతోనే సాధ్యం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కుటుంబపాలన పోయి ప్రజాస్వామ్య పాలన కావాలంటే బీజేపీతో పని చేయాలని చెప్పారు. తెలంగాణలో ఏమి ఒరగపెట్టాడని దేశ రాజకీయాలకు పోతుండు అని మండిపడ్డారు. గొల్లకురుమలను మోసం చేశారని అన్నారు. చండూర్‭ను రెవిన్యూ డివిజన్ చేస్తానన్న హామీ ఏమైందని రాజగోపాల్ ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎటు పోయినై అని నిలదీశారు. మద్యం, డబ్బులు ఇచ్చి మునుగోడులో గెలిచారని ఆరోపించారు. తాను రాజీనామా చేసింది మునుగోడు అభివృద్ధి కోసమేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.