
- ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి.. ధృతరాష్ట్రుడిలా మారిండు
- నేను రాజకీయంగా ఎదగడం వారికి ఇష్టం లేనట్టుంది
- నేనెవరినీ అడుక్కోను.. గల్లా ఎగరేసుకొని ఉంటా
- నా కెపాసిటీ బట్టే మంత్రి పదవి దక్కుతుంది
చౌటుప్పల్, వెలుగు: తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు హామీ ఇచ్చిందని, కానీ, కొందరు రాజకీయాలు చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సీనియర్ నేత జానారెడ్డిసహా కొందరు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ధర్మరాజు పాత్ర పోషించాల్సిన జానారెడ్డివంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. నేను అడుక్కొనే స్థితిలో ఎప్పుడూ ఉండను. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు. గల్లా ఎగరేసుకొని ఉంటా. నా కెపాసిటీతోనే మంత్రి పదవి దక్కుతుంది” అని వ్యాఖ్యానించారు. జానారెడ్డి 30 ఏండ్ల పాటు మంత్రి పదవి అనుభవించారని, రంగారెడ్డి, హైదరాబాద్‌కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని అసహనం వ్యక్తం చేశారు. తాను రాజకీయంగా ఎదగడం వారికి ఇష్టం లేదని, అందుకే అడ్డుకుంటున్నారని అన్నారు.
నా కష్టాన్ని గుర్తిస్తలే
కేసీఆర్‌ను గద్దె దించాలని నిర్ణయించుకుని కాంగ్రెస్‌లో చేరానని, అందుకోసం అహర్నిశలు శ్రమించానని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. అంత కష్టపడ్డ తాను పదేపదే మంత్రి పదవి ఇవ్వాలని పార్టీని అడగాల్సి రావడం బాధేస్తున్నదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తే.. 2 లక్షల మెజార్జీతో ఆయనను గెలిపించానని చెప్పారు. మంత్రులకు ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగించిన అన్నిస్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా.. ఓ ఎమ్మెల్యేగా తాను చామలను గెలిపించుకున్నానని తెలిపారు.
పార్టీ పట్ల అంత విధేయతగా పనిచేస్తున్నా తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఎందుకని కొందరు అంటున్నారని, అది సమస్యే కాదని అన్నారు. జాతీయ క్రికెట్ జట్టులోనే ఇండియా తరఫున యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. దేశానికి, రాష్ట్రానికి సేవచేసేందుకు సామర్థ్యం ఉండాలేకానీ.. వారిద్దరూ ఒకే ఇంట్లోని వారా అనేది చూడకూడదని చెప్పారు.
తమ ఇంట్లో ఒకరు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన తమ ఇద్దరి కెపాసిటీని గుర్తించాలని కోరారు. తనకు పదవి ఇస్తే కిరీటంగా భావించనని, బాధ్యతగా వ్యవహరిస్తానని, రాష్ట్రానికి, పార్టీకి, ప్రభుత్వానికి వన్నెతెచ్చేలా పనిచేస్తానని తెలిపారు.
మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చింది: ఎంపీ చామల
లోక్‌సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు వార్డ్ మెంబర్ కూడా కాలేదని, పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన తనకు పార్టీ ఎంపీ టికెట్ కేటాయిస్తే.. తాను ఎంపీగా గెలవాలంటే రాజగోపాల్ రెడ్డితోనే సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపానని చెప్పారు.
స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం వెళ్లి.. ఆయనను ఇన్చార్జిగా ఉండాలని కోరినట్టు తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని అధిష్టానం మాట ఇచ్చింది వాస్తవమేనని తెలిపారు. కాగా, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకేరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
సభా వేదికగా తెలిపారు.