కేసీఆర్​ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, వెలుగు : కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు పదేండ్లు మోసపోయారని భువనగిరి పార్లమెంట్ ఇన్​చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పుల పాలైన తెలంగాణను గాడిన పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు కరెక్ట్​మొగుడు రేవంత్ రెడ్డేనని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో 15 ఎంపీ సీట్లు గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మునుగోడు ప్రజలు ఉపఎన్నికల్లో కేసీఆర్​ను మూడు నెలలు నిద్రపోనిలేదని, ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటున్నారని, ఆయన బాత్రూంలో పడినంత ఈజీగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి,  భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.