పైసలు తీసుకున్నా.. ధర్మం వైపు నిలబడి ఓటేయండి: రాజగోపాల్ రెడ్డి

వ్యక్తిగతంగా చలమల కృష్ణారెడ్డి అంటే తనకు గౌరవమని.. ఈ ప్రపంచంలో తాను ఎమ్మెల్యే అవుతానని ఎవరైనా పోటీ చేస్తారు గాని.. ఒకరిని ఓడ కొట్టడానికి ఎవరు పోటీ చేయరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు బిజెపి అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి  సొంత గ్రామం మల్లారెడ్డిగూడెంలో 2023, నవంబర్ 21వ తేదీ మంగళవారం  రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తమ గ్రామానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు మంగళహారతులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా  కేసీఆర్  ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి  తాను బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.  ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినా.. గతంలో కొట్లాడిన కాబట్టి తనకు టికెట్ ఇచ్చారని చెప్పారు.

తనకు టికెట్ ఇచ్చిన తర్వాత చలమల కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడానని.. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశం వస్తుందని చెప్పానని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటేనని..బీజేపీని ప్రజలు నమ్మడం లేదని.. అందుకే తాను కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పినా.. చలమల కృష్ణారెడ్డి బీజేపీకీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చలమల కృష్ణారెడ్డి ఎందుకు పోటీ చేస్తున్నాడో.. ఎవరి కోసం పోటీ చేస్తున్నాడో ఆయనకే తెలియాలని... ఉప ఎన్నికలో డబ్బులు పంచి ఓట్లు చీల్చే ప్రయత్నం చేశారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. వ్యక్తి గతంగా తాను ఎటువంటి విమర్శలు చేయనన్నారు. మల్లారెడ్డి గూడెంలో ఉన్న ప్రతి మనిషి గుండె మీద చేయి వేసుకుని ఎవరు ఈ ప్రజల కోసం పాటుపడుతున్నారో... ఎవరు కేసీఆర్ మీద యుద్ధం చేస్తున్నారు...ఎవరు సర్వస్వం కోల్పోయి ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో ఆలోచన చేయండని ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ బ్రతుకులు బాగుపడతాయని ఆయన చెప్పారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ సునామీలో కేసీఆర్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని అన్నారు. పైసలు ఎవరి దగ్గర తీసుకున్నా.. ధర్మం వైపు నిలబడి ఓటు వేయాలని మల్లారెడ్డి గూడెం ప్రజల్ని కోరుతున్నాని రాజగోపాల్ రెడ్డి అన్నారు.