నా బలం, బలగం.. మునుగోడు ప్రజలే: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ఎన్ని సార్లు కొట్లాడినా.. కెసిఆర్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని  మీకు మాట ఇచ్చానని.. ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు అభివృద్ధి జరగాలని..  అందుకే రాజీనామా అస్త్రాన్ని సంధించానని... దెబ్బకు కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావులతోపాటు  ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి మీ కాళ్ళ ముందు మోకరిల్లి అభివృద్ధి చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 2023, నవంబర్  16వ తేదీ గురువారం మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం కొండాపురం గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. గ్రామ మహిళలు మంగళహారతులు ఇచ్చి కోలాటాలు నృత్యాలతో ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఎమ్మెల్యే 18 నెలల సమయం ఉన్నా కూడా రాజీనామా చేయరని.. కానీ, తాను మీ అభివృద్ధి కోసం రాజీనామా చేశానన్నారు.  తన రాజీనామాతోనే.. గట్టుప్పల్ మండలం అయ్యిందని, చండూరు రెవిన్యూ డివిజన్ గా ఏర్పడిందని..కొత్త రోడ్లు వేశారని చెప్పారు. తాను రాజీనామా చేయడం వల్ల నియోజకవర్గంలో ఉన్న చిరు వ్యాపారులు బాగుపడ్డారని.. ప్రజల ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారని అన్నారు.

56 సంవత్సరాలు నిజాయితీగా బతికానని.. అబద్ధం ఆడలేదని, మోసం చేయలేదని.. అయినా తననున అమ్ముడుపోయానని బద్నామ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి పోయినా, డబ్బులు పోయినా.. బద్నామ్ చేసినా తనకు బాధ లేదని.. మునుగోడు ప్రజలకు అభివృద్ధి నిధులు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. తన బలగం, బలం.. మునుగోడు ప్రజలేనన్నారు.

మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి.. చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువస్తే.. ప్రతి పేద మహిళలకు 2500 రూపాయలు వస్తాయన్నారు. 4000 రూపాయల ఆసరా పెన్షన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. వీటితోపాటు,  ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత  కరెంటు,  ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఆయన చెప్పారు.

గృహలక్ష్మి పథకం కింద రూ.5 లక్షలు మంజూరు చేసి ఇల్లులు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. రైతన్నలకు రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి పూర్తిచేస్తుందని అన్నారు. భూమి ఉన్న వాళ్లకు కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ. 15వేలు ఇస్తామని చెప్పారు. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తెలంగాణ ఇస్తే..  ఒక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. రెండుసార్లు కేసీఆర్ గెలిపించారని.. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ బ్రతుకులు మారుతాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు.