టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడుకు చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తాను రాజీనామా చేయకపోతే మునుగోడు గురించి ఎవరూ మాట్లాడేవారే కాదన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నిక రావడంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి క్యూ కడుతున్నారని అభిప్రాయపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీల వారిని బెదిరిస్తూ తమ పార్టీ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. మునుగోడులో జరుగుతున్న ధర్మ యుద్ధంలో ధర్మాన్ని గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చాక కేసీఆర్ కుటుంబమంతా విమానంలో పారిపోవాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి సెటైర్ వేశారు. పింఛన్ రాదేమోనని భయపడి టీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని జనానికి సూచించారు. ఈ ధర్మ పోరాటంలో ఓటర్లు ఇచ్చే తీర్పు మీదే మునుగోడు భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ ప్రచారంలో రాజగోపాల్ రెడ్డితో పాటు బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, మర్రిగూడ మండలం ఇంచార్జి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.