- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఉమ్మడి జిల్లా బాధ్యతలు
- టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేయాలని ఆదేశాలు
- స్టేట్ స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఫైనల్ కానున్న అభ్యర్థులు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా బీజేపీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తొలి ఘట్టం ముగిసింది. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ రెండు రోజుల పాటు ఆశావహులతో భేటీ అయ్యారు. ఒక్కో నియోజకవర్గ నేతలతో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. రాష్ట్రస్థాయిలో స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి, జాతీయ నాయకులు డాక్టర్ ల క్ష్మణ్, బండి సంజయ్‌తో ఏర్పాటైన త్రిముఖ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.
అయితే ఆశావహులతో సంప్రదింపులు జరపుకుండా క్యాండిడేట్లను ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని భావించి.. కీలక నేతలు జిల్లాల బాట పట్టారు. ఇందులో భాగంగానే నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని జిల్లా, రాష్ట్ర స్థాయి ఆఫీ బేరర్స్, మండల పార్టీ అధ్యక్షులను రప్పించి వాళ్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతర మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేయాలని సూచించారు. సర్వే ప్రక్రియ కొనసాగుతోందని అప్పటి వరకు ఆశావహులు జనాల్లోనే ఉండాలని ఆదేశాలిచ్చారు.
ఇంకాస్త టైం పట్టొచ్చు
తరుణ్ చుగ్‌తో భేటీ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అభ్యర్థులపై పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాండేట్లు అనౌన్స్ కాగా, కాంగ్రెస్ సైతం క్లియర్వెకెన్సీల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బీజేపీలో కూడా కసరత్తు చేస్తున్నా.. ఇంకాస్త టైం పట్టొచ్చని సీనియర్ల చెబుతున్నారు. కాగా, నల్గొండ, సూర్యాపేట, మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలపై పార్టీ నమ్మకం పెట్టుకుంది. మిగిలిన చోట్ల కూడా సత్తా చాటుతామని ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్యాండిడేట్లను ప్రకటిస్తే మరింత గట్టిగా పనిచేస్తామని వారు చెబుతున్నారు. కానీ, గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే కొన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో హైకమాండ్ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. 2018 ఎన్నికల్లో బీఫాం తీసుకున్న కొందరు అభ్యర్థులు మధ్యలోనే చేతులెత్తేశారు. ఇంకొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కోవర్టులుగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొంత వేచిచూసే దోరణి అవలంబించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజగోపాల్ రెడ్డికి కీలక బాధ్యతలు
మాజీ ఎమ్మెల్యే, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తరుణ్ చుగ్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ తరపున జరిగే ముఖ్య కార్యక్రమాలకు తప్పనిసరిగా రాజగోపాల్‌రెడ్డిని ఆహ్వానించాలని, మాజీ ఎంపీగా ఆయన సేవలను వినియోగించుకోవాలని జిల్లా అధ్యక్షులకు, సీనియర్ నేతలకు సూచనలు చేశారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో క్యాండిడేట్ల ఎంపిక విషయంలోనూ రాజగోపాల్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ మేరకు ఆశావహులకు సంకేతాలు కూడా పంపారు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు శుక్రవారం హైదరాబాద్‌లో రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా, గురువారం జరిగిన మీటింగ్‌లో తరుణ్ చుగ్ భువనగిరి సెగ్మెంట్‌లో పర్యటించాలని రాజగోపాల్ రెడ్డికి సూచించారు. పార్టీకి మేలు జరుగుతుందని, ఆ దిశగా చొరవ చూపాలని కోరారు. అయితే అదే నియోజక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డిని ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం గమనార్హం.