జీతాలియ్యడు గానీ.. జాతీయ రాజకీయాల్లోకి పోతడంట

కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికపైనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందని.. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు తీర్పు తర్వాత కేసీఆర్ పత్తా లేకుండా పోవడం ఖాయమన్న రాజగోపాల్.. మునుగోడులో తాను గెలిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న ఆయన.. రానున్న ఎన్నికల్లో కమలం పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలపై నమ్మకంతో రాజీనామా చేసిన తనకు అండగా నిలవాలని కోరారు. 

కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆత్మ గౌరవం కోసం కొట్లాడిన ఉద్యమకారుల గొంతునొక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రపాలన దుర్మార్గంగా మారిపోయిందని, జనం పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రజలను తాగుబోతులను చేసి రాష్ట్ర బడ్జెట్ పెంచుకుంటున్నాడని రాజగోపాల్ ఫైర్ అయ్యారు.