గ్రామాలు అభివృద్ధి చెందాలంటే.. బెల్ట్ షాపులు బంద్ కావాలె: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బెల్ట్ షాపులపై మరోసారి స్పందించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా బెల్ట్ షాపులు బంద్ కావాలన్నారు. గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను మూసివేస్తేనే అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎందరో మహిళాలు కోరిన మాట ప్రకారమే ఈ బెల్ట్ షాపుల మూసివేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

వెంటనే స్పందించి గ్రామాల్లో ఉన్న మహిళలు బెల్ట్ షాపులు మూసివేయాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. 


గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులను కాలరాశారని మండిపడ్డారు. నియంత పరిపాలన పోయి ప్రజాస్వామ్య, పేదల ప్రభుత్వం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని చెప్పారు. ఈ పార్టీ వాళ్లకు అయితేనే సంక్షేమ పథకాలు ఇస్తాం.. ఆ పార్టీ వాళ్లకైతే పథకాలు ఇవ్వం అనే విధానానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు.