మునుగోడు ప్రజలకు అండగా ఉంటా..

మునుగోడు రాజకీయాలు రంజుగా మారాయి. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు టీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గతంలో తన వెంట నడిచిన కార్యకర్తలను మంత్రి జగదీష్ రెడ్డి బెదిరించి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా  చండూర్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..అవినీతి సొమ్ముతో జగదీష్ రెడ్డి నీచ రాజకీయాలకు తెరతీశారని మండిపడ్డారు. 

విపక్ష ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్..తన రాజీనామాతో ఫామ్ హౌస్ నుండి  ముఖ్యమంత్రి బయటకు వచ్చారని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మార్పు  కోసమే మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ముచ్చటగా మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మునుగోడు ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.