రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని చెప్పారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ కి రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ నడుస్తోందని, 80 సీట్లకు పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అధికారపార్టీ నుండి ప్రతిపక్షంలోకి వలసలు వస్తున్నాయని, కేసీఆర్ పాలనపై వ్యతిరేకత కనపడుతోందని తెలిపారు. బీజేపీలో చేరినప్పుడు కాంట్రాక్టుల కోసం వెళ్లారని విమర్శించారని, ఇప్పుడు తన గురించి అనడానికి అవకాశం లేదని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసేవారి నోర్లు మూతపడ్డాయన్నారు.

పేదలకు అండగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలే తిప్పికొడుతారని హెచ్చరించారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తాము చాలా కష్టపడ్డామన్నారు. ఈసారి ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెట్టే పరిస్థితి లేదని, కచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉన్నారని తెలిపారు. బీజేపీ నుండి సొంత ఇంటికి వచ్చానని మునుగోడు ప్రజలు తనకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. తన నామినేషన్ కోసం ప్రజలు స్వచ్చందంగా తరలివస్తున్నారని తెలిపారు. 

Also Read :- తెలంగాణ బీజేపీ ఫైనల్ లిస్ట్ ఇదే... ముగ్గురు అభ్యర్థుల మార్పు