తన రాజీనామా దెబ్బకి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ మునుగోడుకు క్యూ కట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తనపై మునుగోడు ప్రజలకు ఎనలేని ప్రేమ ఉందని..అందుకే 2018లో గెలిపించారని గుర్తు చేశారు.
మునుగోడు ప్రజలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీలో ప్రభుత్వంపై తీవ్రంగా పోరాటం చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారం, డబ్బునే నమ్మకున్నారని..తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. శాసనసభలో ప్రశ్నించే గొంతును లేకుండా చేయాలనే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దుర్మార్గమైన కేసీఆర్ పాలన పోతేనే ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పు ఇవ్వాలని కోరారు. ఇక్కడి ఓటర్ల తీర్పుతో తెలంగాణ రాత మారబోతోందని చెప్పారు.
తనకు జ్వరం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే డ్రామా అని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని..తన చివరి శ్వాస వరకు మునుగోడు ప్రజల కోసం పాటుపడతానని తెలిపారు. రూ.1000 కోట్ల తో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చండూరు మండలం కొండాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.