మునుగోడులో జరగనున్న బీజేపీ సభ ‘మునుగోడు సమరభేరి’తో తెలంగాణలో ధర్మ యుద్ధం మొదలుకాబోతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ధర్మయుద్ధంలో విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ మొదలవడానికి ముందు ‘వీ6’తో ఆయన మాట్లాడారు. సభకు ఐదు లక్షల మందికి తక్కువ రారని తెలిపారు. మునుగోడులో కేసీఆర్ మీటింగ్ ఎందుకు పెట్టిండో.. తన ప్రసంగంలో ప్రజలకు చెబుతానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘ హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీకి ఓటేస్తే.. బావుల కాడ మీటర్లు రాలేదు కదా.. మరి మునుగోడులో మాత్రం బీజేపీకి ఓటేస్తే బావుల కాడ మీటర్లు ఎట్లొస్తయ్ ?’’ అని చెప్పారు.
కేసీఆర్ కు శాస్తి చేసేందుకు ప్రజలు సిద్ధం
ఈసందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మునుగోడు సభకు ప్రజల స్పందన బాగుందన్నారు. గ్రామ స్థాయిలో బీజేపీ లేదు అనే ప్రచారంలో వాస్తవం లేనే లేదన్నారు. మునుగోడు సభ తర్వాత.. దక్షిణ తెలంగాణలో బీజేపీ లేదు అనే విషయం ఉండదన్నారు. గ్రామీణ ప్రజలు, రైతు వర్గాలు బీజేపీ వైపు చూస్తున్నారని వివేక్ తెలిపారు. మునుగోడు సభకు జనం పోటీ పడి వస్తున్నారని చెప్పారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి హామీలను నెరవేర్చకుండా మొండిచెయ్యి మిగిల్చిన సీఎం కేసీఆర్ కు తగిన శాస్తి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు .