అప్పట్లో కేసీఆర్ కుటుంబం మా ఇంటి చుట్టు తిరిగేది : రాజగోపాల్ రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లి అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము లేదని  మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్ రావుకు కాళేశ్వరం మీదున్న ప్రేమ చర్లగూడెం రిజర్వాయర్ మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. మునుగోడులోని అజిలాపురంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.  ‘‘ఇంకా 18 నెలలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఏం చేసేది లేదు.. రాజీనామా చేస్తే అందరూ మా మునుగోడు ప్రజల కాడికి వస్తరని భావించా. అందుకే రాజీనామా చేసిన. ఈ ఒక్క కారణం వల్లే నిద్రపోయిన కేసీఆర్ లేచి వచ్చాడు. కేసీఆర్ కొడుకు గట్టుప్పల్ కు,  అల్లుడు మర్రిగూడెం కి, ముఖ్యమంత్రి లెంకలపల్లి కి వచ్చారు’’ అని ఆయన వివరించారు. తాను ఈ ఉప ఎన్నికలో పోటీచేస్తున్నది ఎమ్మెల్యే పదవి కోసం కాదని.. ప్రజాస్వామ్యాన్ని బాగుచేయడానికే బరిలో నిలిచానని స్పష్టం చేశారు.

‘‘ఈసారి గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు.. మీరే’’ అని ప్రజలకు చెప్పారు.  రాజగోపాల్ రెడ్డి ని కొనే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. ‘‘రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక... నేను అమ్ముడుపోయానని కట్టుకథలు అల్లుతున్నారు’’ అని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ తెలంగాణ ఉద్యమం చేస్తున్న సందర్భంలో డబ్బుల కోసం మా ఇంటి చుట్టూ కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరిగే వాళ్ళు.  నేను కోట్ల రూపాయల దానధర్మాలు చేసినవాణ్ని’’ అని పేర్కొన్నారు. అహంకారం పెరిగి రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన కేసీఆర్ ను  ఏం చేయాలని స్థానికులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అడిగారు.