నకిరేకల్ లో ఒక దొంగ పులి పోయి.. నిజమైన పులి వచ్చిందన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సోమవారం(నవంబర్ 6) జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నమ్మకద్రోహం చేసిన చిరుమర్తి లింగయ్య గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నానని.. మీ బాస్ కేసీఆర్, కేటీఆర్ కి మునుగోడులో మూడు చెరువుల నీళ్లు తాగించానని ఫైర్ అయ్యారు. రామన్నపేట మండలంలో కాంగ్రెస్ కు 10వేల మెజారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చిరుమర్తి మమ్మల్ని నమ్మకద్రోహం, మోసం చేయడం వల్ల ఇంకొక వ్యక్తికి సహాయం చేయాలన్నా ఆలోచిస్తున్నాం. ఆయనకు ఏం అన్యాయం చేశాం..చిన్నప్పటి నుంచి మా వెంట ఉన్నాడని..ఆయనకు సహాయం చేయడమే మేము చేసిన పాపమా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతున్నాననే భయంతో.. అసహనంతో.. లింగయ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు.
ఇప్పుడు భూమి, ఆకాశం ఒకటైన కూడా నకిరేకల్ లో చిరుమర్తి గెలవరని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి వస్తాడా.. కేటీఆర్ వస్తాడా.. కేసీఆర్ వస్తాడా రమ్మను నకిరేకల్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా రాజగోపాల్ రెడ్డికి పదవి లేకపోయినా.. పవర్ఫుల్ మనిషి అని తెలిసిపోయిందన్నారు. ఈసారి నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు ధర్మం వైపు ఉంటారా...న్యాయం వైపు ఉంటారా... మోసం చేసిన లింగయ్య వైపు ఉంటారా ఆలోచించాలని కోరారు. రాజకీయంగా ఎదుర్కోలేక అమ్ముడుపోయానని తనను బద్నామ్ చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.