సొంత డబ్బుతో మునుగోడుకు చేతనైనంత చేశా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: తన రాజీనామా వల్లనే కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మునుగోడులోని మసీద్ గూడెంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు అని ఆరోపించారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, ఎవరినైనా మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్... అబద్ధపు హామీలతో ప్రజలను వంచించారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ కు డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకు వస్తారని, లేకుంటే ఆయన ఫాం హౌజ్ కే పరిమితమవుతారని ఫైర్ అయ్యారు. తనను ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని కోట్లు పెట్టి నాయకులను కొంటున్నారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 

కేసీఆర్ చెంప చెల్లుమనిపించేలా తీర్పునివ్వండి

మునుగోడు బై పోల్ లో సీఎం కేసీఆర్ చెంప చెల్లుమనిపించేలా తీర్పునివ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను కోరారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అసెంబ్లీ వేదికగా మునుగోడు సమస్యలను చెప్పానని, కానీ సీఎం ఏనాడు పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ మధ్యలోనే పారిపోతే రూ.30 కోట్లు సొంతంగా ఖర్చుపెట్టి పిల్లాయపల్లి కాలువ నిర్మాణాన్ని పూర్తి చేశానని చెప్పారు. ప్రతి గ్రామానికి తనకు చేతనైనంత పని చేశానని చెప్పారు. మునుగోడు ప్రజలకు న్యాయం జరగాలనే కారణంతోనే తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తాను కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసినప్పటి నుంచే కేసీఆర్ లో భయం మొదలైందని తెలిపారు. మునుగోడు బై పోల్ లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ కు చెందిన 100 మంది ఎమ్మల్యేలు, మంత్రులను మునుగోడులో మోహరించారని చెప్పారు. డబ్బు, మందు, మాంసం పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి దళిత బంధు ఇచ్చారని, ఇవాళ తనను ఓడించడానికి గొల్ల కురుమల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని ఆరోపించారు. తనను గెలిపించి కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని మునుగోడు ప్రజలను రాజగోపాల్ రెడ్డి కోరారు.