మునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్ ను మార్చే ఎన్నిక: రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: తనను ఓడించడానికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు డబ్బు సంచులిచ్చి మునుగోడుకు పంపించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదనే విషయాన్ని గ్రహించిన కేసీఆర్.. 100 మంది ఎమ్మెల్యేలను ప్రచారానికి పంపించారని విమర్శించారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు మునుగోడు సమస్యల పైన మాట్లాడానని, కానీ ఏనాడు కేసీఆర్ తమ సమస్యలను పట్టించుకోలేదని తెలిపారు. మునుగోడు అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం సహకరించనందుకే తాను రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. 1000 మందికి పైగా అమరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఎనిమిదేళ్లలో ఏ ఒక్క వర్గానికి అభివృద్ధి ఫలాలు అందలేదని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు, ఉచిత విద్య, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి... ఇలా ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు.

మోడీ, అమిత్ షాలను చూసి కేసీఆర్ భయపడుతుండు

మోడీ, అమిత్ షాలను చూసి కేసీఆర్ భయపడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ రోజైతే ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ కుట్రలు చేశారో... ఆ రోజు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఆరోపించారు. ఉద్యమకారులను బయటకి పంపించి.. ఏనాడు ఉద్యమంలో లేని గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి ద్రోహులకు మంత్రి పదవులు అప్పజెప్పారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఒక్క రోజు కూడా భూ నిర్వాసితుల గురించి మాట్లాడని హరీశ్ రావు.. ఇవాళ మునుగోడుకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి జగదీశ్ రెడ్డికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంచడం తప్ప మరేం చేతకాదని విమర్శించారు. మునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్ ను మార్చే ఎన్నిక అని,  బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.