మునుగోడు: తన రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత మొత్తుకున్నా సీఎం కేసీఆర్ మునుగోడుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, అందుకే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ఇవాళ తనను ఓడించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మునుగోడులో మకాం వేశారని మండిపడ్డారు. తాను రాజీనామా చేయకపోతే వాళ్లంతా వచ్చేవాళ్లా అని, మునుగోడుకు ఇన్ని నిధులు మంజూరు అయ్యేవా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ దేశం మొత్తం మునుగోడు వైపే చూస్తోందని, ఇదంతా తాను రాజీనామా చేయడం వల్లేనని చెప్పారు.
ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తనను ప్రశ్నిస్తారని భావించిన కేసీఆర్.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్లు కొన్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, కేజీ టూ పీజీ, రుణ మాఫీ, సీసీ రోడ్లు, ఉద్యోగాలు అంటూ ఎన్నికల సమయంలో హామీలిచ్చిన కేసీఆర్.. గెలిచాక ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. గ్రామానికి 20 ఇండ్లు ఇవ్వలేదు గానీ... 20 బెల్ట్ షాపులు మాత్రం ఇచ్చారని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో తనను ఓడించడానికి 100 మంది కౌరవులు వచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మండిపడ్డారు. టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని, లేకుంటే కేసులు పెట్టి జైలులో పెడుతామని బీజేపీ సర్పంచులు, ఎంపీటీసీలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ను ఫాంహౌజ్ నుంచి గల్లా పట్టి లాక్కొస్తామని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.