అసలైన డ్రామారావు కేటీఆరే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, వెలుగు: తనకు జ్వరం వచ్చి హెల్త్​ చెకప్​ చేయించుకుంటే కేటీఆర్ డ్రామాలాడుతున్నాడని అంటున్నారని, అసలైన డ్రామారావు ఆయనేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు.బుధవారం మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, పలివెల, ఎల్గలగూడెం, రావి గూడెం, జక్కలవారిగూడెం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మునుగోడు ప్రజల తీర్పు కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందన్నారు. కేసీఆర్​ ఆరెకరాలు ఉన్న భూమిని 600 ఎకరాలుగా చేసుకున్నాడన్నారు. మూడున్నరేండ్లలో సిద్దిపేటకు రూ.712 కోట్లు ఇస్తే మునుగోడుకు రూ.రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చాడన్నారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే స్థితిలో లేరని, కుటుంబ పాలన అంతమొందించేందుకు ఉద్యమకారులంతా ఏకమవుతున్నారన్నారు. తనను ఓడించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడికి వచ్చారని..ఈ ప్రాంత సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడినప్పుడు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ చాడ సురేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ రాష్ట్ర నాయకులు మారగోని రవియాదవ్, బీజేపీ జిల్లా నాయకులు వేదాంతం గోపీనాథ్ పాల్గొన్నారు.