చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలి

సీఎం కేసీఆర్ పతనం మునుగోడు నుంచే మొదలు కానుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన పోవాలని సొంత టీఆర్ఎస్ నాయకులే చెబుతున్నారంటూ కామెంట్స్ చేశారు. ‘మునుగోడు ప్రజల చేతిలో నేను ఒక ఆయుధం. ఈ ఆయుధంతో కేసీఆర్ ని అంతమొందించాల్సిన అవసరం ఉంది. విజయం మనదే. కానీ, మెజార్టీ ఎంతో మీరు చెప్పాలి. ఇక్కడ గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు మునుగోడు ప్రజలు’ అంటూ వ్యాఖ్యానించారు. మునుగోడులో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేకపోయానని, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే తాను పదవికి రాజీనామా చేశానని మరోసారి స్పష్టం చేశారు.

తన రాజీనామాతోనే మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను రాజీనామా చేసిన అనంతరం ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్ మునుగోడు వచ్చారని ఎద్దేవా చేశారు. నెల రోజుల నుండి ఏ టీవీ పెట్టినా మునుగోడు అంశాలే ప్రసారం అవుతున్నాయన్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డిలే అవుతారని చెప్పారు. తన ప్రాణం పోయినా మునుగోడు ప్రజలు తల దించుకునే పని చేయనని చెప్పారు. చరిత్రలోనే నిలిచిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.