యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఒక్కో కుటుంబానికి అందజేస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే.. ఈ కుటుంబాల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారిని తానే చదివిస్తానని ఆయన స్పష్టం చేశారు. తేజ ఫుడ్ ఇండస్ట్రీ కూలీలతో వెళ్తున్న ఆటోను, అదే సంస్థకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు మహిళలు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన శిరీష, ధనలక్ష్మి, నాగలక్ష్మి, అనసూయగా గుర్తించారు.