బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ కారుడు పోలేపల్లి నర్సింహ ఇంటికెళ్లి పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అభివృద్ధి ఫలాలు కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ కారులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వారికి ఇండ్లు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించిన జయశంకర్ సార్ ని ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. జయశంకర్ సార్ జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గనికి ఈఎస్ఐ ఆసుపత్రి, స్టేడియం ఏర్పాటు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే అందుకు ఒప్పుకుందన్నారు. యువత కు స్కిల్ డెవలప్ మెంట్, రోడ్లకు రూ.200 కోట్లు, స్వయం ఉపాధి కి ముద్ర లోన్లు ఇవ్వాలని కోరితే అందుకు అమిత్ షా అంగీకారం తెలిపారని చెప్పారు. మునుగోడు అభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన అమిత్ షాకి ధన్యవాదాలు తెలిపారు.