ఒక్క బెల్ట్​షాపు ఉన్నా ఊరుకోను .. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక

మునుగోడు నియోజకవర్గంలో ఒక్క బెల్ట్‌‌ షాపు కనిపించినా ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మునుగోడులోని క్యాంప్​ ఆఫీసులో 26 గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార టైంలో బెల్ట్​షాపుల కారణంగా తమ కాపురాలు ఆగమవుతున్నాయని ఎంతో మంది మహిళలు వాపోయారన్నారు. అందుకే అధికారంలోకి రాగానే బెల్ట్​షాపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. హామీ ప్రకారం కార్యాచరణ ప్రకటించామని స్పష్టం చేశారు. గ్రామాల్లో నాయకులంతా రాజకీయాలకు అతీతంగా ఏకమై బెల్ట్‌‌ షాపులు లేకుండా చేయాలని సూచించారు.

2014కు ముందు తెలంగాణలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు లేవని, బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెరిచారని మండిపడ్డారు. కంట్రోల్​చేయకుంటే యువత జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు మూసివేతను ఉద్యమంలా చేపట్టాలని, ప్రతి ఊరిలో చాటింపు వేయించాలని సూచించారు. 10 మందితో ఒక కమిటీ వేయాలని, అందులో నలుగురు మహిళలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఊరి పొలిమేర లోపల లిక్కర్, గంజాయి ఆనావాళ్లు లేకుండా చేయడమే ఈ కమిటీ బాధ్యత అని రాజగోపాల్​రెడ్డి చెప్పారు. 

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారాబోయిన రవి ముదిరాజ్, కుంభం శ్రీనివాస్ రెడ్డి, వేంరెడ్డి జితేందర్ రెడ్డి, జాజుల అంజయ్య గౌడ్, బూడిద లింగయ్య యాదవ్, తాటికొండ సైదుల్ యాదవ్, భీమనపల్లి సైదులు, నేతలు సాగర్ల లింగస్వామి యాదవ్, పందుల భాస్కర్, బీసం విజయ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖ , పోలీస్ అధికారులతో రాజగోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపులు క్లోజ్​చేయాల్సిన బాధ్యతను పోలీసులు తీసుకోవాలని సూచించారు. బెల్ట్ షాప్ నడిపేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్​విక్రయిస్తే కేసు నమోదు చేయాలని ఆదేశించారు.