సీఎం కేసీఆర్ ను గద్దె దింపాలనే తాను రాజీనామా చేశానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఒక నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్ పై తప్పుడు ఆరోపణలు చేసి, మంత్రి వర్గం నుంచి తొలగించారని విమర్శలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలవి బానిస బతుకులుగా మారాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మూడున్నరేళ్లు ఉన్నా ప్రజలకు న్యాయం చేయలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల తప్ప రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు. ఉపఎన్నిక వస్తే ఓట్లు దండుకోవడం కోసం.. టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి పనులు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపఎన్నికలో ఓడిపోతామన్న భయంతో గ్రామాల్లో ప్రచారానికి ఎమ్మెల్యేలు, మంత్రులను కేసీఆర్ పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.