మునుగోడు ప్రజలు చరిత్ర సృష్టించే తీర్పు ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో తిష్ట వేశారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల పేరు మీద లక్ష కోట్ల దోపిడీ జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా.. ల్యాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా జరిగిందని.. అందుకు సంబంధించిన నివేదికను అమిత్ షాకు అందజేశానని చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఎంతోమంది ప్రజల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా కొత్తగా చట్టం తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు.. కేసీఆర్‌ను ఓడిస్తానని రాజగోపాల్ రెడ్డి శపథం చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపే వరకు తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. పార్టీ మారానని నన్ను అంటున్నారు కాని... 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీని చంపేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఉండకుండా చేయాలని కుట్ర చేశారని.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మునుగోడులో తాను గెలిస్తే.. టీఆర్ఎస్ గవర్నమెంట్‌ను 15 రోజుల్లో పడగొడతామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.