నేను బీజేపీలో చేరి సాగర్​లో పోటీ చేస్తే జానారెడ్డికి మూడో ప్లేసే

  • బీజేపోళ్లు నన్ను సంప్రదించిన్రు.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు
  • కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని బీజేపీ నేతలు తనను సంప్రదించారని, దీనిపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్​ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌ రెడ్డి అన్నారు. మునుగోడులో రిజైన్ చేసి, నాగార్జునసాగర్‌‌లో పోటీ చేయాలని బీజేపీ నేతలు అడిగారని, బలమైన అభ్యర్థిగా తానైతే బెటరని వాళ్లు అనుకుంటున్నారని చెప్పారు. బరిలోకి దిగితే రిస్క్ అవుతుందేమోనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ వద్ద రాజగోపాల్​రెడ్డి మీడియాతో చిట్‌‌చాట్‌‌ చేశారు. తాను బీజేపీలో చేరి  పోటీ చేస్తే బీజేపీ, టీఆర్‌‌ఎస్‌‌ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌‌ నేత జానారెడ్డికి మూడో స్థానం దక్కుతుందన్నారు. టీఆర్‌‌ఎస్‌‌ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమని, తాను గతంలోనూ కామెంట్స్​ చేశానని, వాటికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇటీవల తిరుపతిలో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో కుటుంబ కలహాలు ఉన్నాయన్నారు. కేటీఆర్ సీఎం అవుతున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ మాట్లాడించారని,  కానీ ఫ్యామిలీ మెంబర్సే కేటీఆర్‌‌ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో మంత్రి హరీశ్​రావు, ఎంపీ సంతోష్-, ఎమ్మెల్సీ కవిత హవా నడుస్తోందన్నారు.