
- నాలుగు రోజుల్లోనే ఎన్వోసీలు ఇప్పించిన కదా
- టిమ్స్ హాస్పిటల్స్ వర్క్స్‌పై మంత్రి వెంకట్ రెడ్డి రివ్యూ
- ఏదైనా సమస్య ఉంటే చెప్పండి వెంటనే పరిష్కరిస్త
- పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: టిమ్స్ హాస్పిటల్స్ కోసం బ్యాంకుల నుంచి లోన్లు వచ్చినా పనులు ఎందుకు లేట్ అవుతున్నాయంటూ అధికారులపై ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ హాస్పిటల్స్‌కు సంబంధించిన ఎన్వోసీలను అడిగిన నాలుగు రోజుల్లోనే ఇప్పించానని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. పనుల్లో అలసత్వం వహిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం సెక్రటేరియెట్‌లో టిమ్స్ హాస్పిటల్స్, సీఆర్ఐఎఫ్ రోడ్స్, సెక్రటేరియెట్ పార్కింగ్, హైదరాబాద్ కొత్త కలెక్టరేట్ నిర్మాణ పనులపై మంత్రి వెంకట్ రెడ్డి రివ్యూ చేపట్టారు. ఈ మీటింగ్‌లో ఆర్ అండ్ బీ సెక్రటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సీ గణపతిరెడ్డి, సీఈ శారదతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఉస్మానియా, నిమ్స్, గాంధీ హాస్పిటల్స్‌లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. వెంటిలేటర్ బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడ్తున్నరు. టిమ్స్ హాస్పిటల్స్ పనులు వేగంగా చేపట్టాలి’’అని ఆదేశించారు.
సెక్రటేరియెట్‌లో పార్కింగ్ ప్లేస్ లేక ఇబ్బందులు
రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల నిధులతో నిర్మిస్తున్న సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పనుల పురోగతి గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం పనులకు టెండర్లు పిలిచామని వివరించారు. మిగిలిన వాటికి టెండర్ ప్రక్రియ రెడీ చేసుకున్నామని.. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిందని తెలిపారు. గురువారం నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రికి అధికారులు వివరించారు. గడిచిన ఐదేండ్లలో రోడ్ల నిర్మాణాలు జరగలేవని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు.
‘‘సెక్రటేరియెట్‌లో పార్కింగ్ ప్లేస్ లేక మంత్రులు, నేతలు, ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.30 కోట్లతో పార్కింగ్ నిర్మాణ పనులు చేపడ్తున్నం. అధికారులు వెంటనే టెండర్లు పిలిచి వర్క్స్ ప్రారంభించేలా చూడాలి. రోజుకు సగటున 750 నుంచి వెయ్యి వెహికల్స్ సెక్రటేరియెట్‌కు వస్తుంటాయి. పార్కింగ్ షెడ్స్ లేకుండా బిల్డింగ్ ప్లాన్‌కు ఎలా అనుమతులు ఇచ్చారు?’’అని అధికారులను మంత్రి ప్రశ్నించారు. ప్రపోజల్స్ చివరి దశకు చేరుకున్నాయని, త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రికి ఈఎన్సీ గణపతి రెడ్డి వివరించారు. దీంతో అధికారులు చూపించిన సెక్రటేరియెట్ పార్కింగ్ ప్లాన్‌లో మంత్రి పలు సూచనలు చేశారు. వాహన డ్రైవర్లకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బేగంపేట పాటిగడ్డలో నిర్మించనున్న హైదరాబాద్ కొత్త కలెక్టరేట్ ప్లాన్లు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు.
నేడు అమెరికాకు మంత్రి వెంకట్ రెడ్డి
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానంతో పాటు వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం నుంచి ఆరు రోజుల పాటు మంత్రి వెంకట్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. అమెరికా నుంచి రాగానే జిల్లాల్లో పర్యటనలు చేపడ్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రజలు రోడ్ల కారణంగా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.