రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

యాదగిరిగుట్ట, వెలుగు : దేశంలో కార్పొరేట్ల ఆగమనంతో సగం పల్లెటూళ్లు పల్లెదనం కోల్పోయి ఆగమయ్యాయని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో 'గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ- గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-–2024'ను  మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి పల్లెలు కార్పొరేట్ శక్తుల మాయాజాలంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు.

విదేశీ పరిజ్ఞానం వ్యవసాయ రంగాల్లో ఎక్కువై పండించే ప్రతి పంట, తాగే ప్రతి నీటి చుక్క కలుషితంగా మారుతున్నాయన్నారు. రైతును రాజు చేయడం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇందులో భాగంగానే రైతు రుణాల మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా పథకాన్ని సైతం అమలు చేయబోతున్నామని వెల్లడించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను ఆయన సందర్శించారు. 

కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వ్యవసాయ, రైతు కమిషన్​ చైర్మన్ కోదండరెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యామహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, జిల్లా నాయకుడు వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సుధాహేమేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.