బీఆర్​ఎస్​ను జనం మూసీలో పడేసినా కేటీఆర్​ అహంకారం తగ్గలే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

  • రేవంత్​ చేతి వేలిగోటికి కూడా ఆయన పనికిరాడు
  • సీఎంపై ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోం: మల్లు రవి
  • కేటీఆర్​ను మెంటల్​ దవాఖాన్ల చేర్చాలి: బండి సుధాకర్​గౌడ్​, 
  • చరణ్​కౌశిక్​ యాదవ్​ఓటమితో మతిస్థిమితం కోల్పోయిండు: సుజాతా పాల్​
  • ఆటోల్లో తిరుగుతూ డ్రామాలాడ్తున్నడు: భవానీరెడ్డి

యాదాద్రి/హైదరాబాద్​, వెలుగు:  సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్​ చేసిన కామెంట్లకు కాంగ్రెస్​ పార్టీ నేతలు తీవ్రంగా  స్పందించారు. ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలో పోయిందన్న ఫ్రస్టేషన్​లో నియంతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూసీలో పాతరేసినట్టుగా బీఆర్ఎస్​ను ప్రజలు ఓడించినా కేటీఆర్​కు అహంకారం తగ్గలేదని, బుద్ధిరాలేదని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘సీఎం రేవంత్​పై కేటీఆర్  నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు.. రేవంత్​ చేతి వేలిగోటికి కూడా కేటీఆర్​ పనికిరాడు’’ అని విమర్శించారు. 

సోమవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ మండలం గూడూరులో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్​ గజదొంగ. బీఆర్ఎస్​ దొంగల పార్టీ. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నరు. ఇప్పుడా కాళేశ్వరం కూలిపోయింది” అని అన్నారు. ‘‘కేసీఆర్​ దొంగ దీక్షతో తెలంగాణ రాలే.. అమరుల ప్రాణ త్యాగాలను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాం. తెలంగాణ కోసం నేను దీక్ష చేస్తే మా పార్టీ సస్పెండ్​ చేసింది. దీక్ష కారణంగా నా కిడ్నీలు ఖరాబైనయ్​. మీ మామకు ఏ పార్ట్​ ఖరాబైందో చెప్పు  హరీశ్​రావు” అని ఆయన నిలదీశారు. కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఏఐసీసీ తెలంగాణ మీడియా ఇన్​చార్జ్​ సుజాతా పాల్​ అన్నారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కవిత చెప్తున్నారని, ఆ వివరాలను బయటపట్టాలని పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి డిమాండ్​ చేశారు. గోప్రో కెమెరాలు పెట్టుకుని, సొంత కార్మిక సంఘం ఆటోల్లో తిరుగుతూ కేటీఆర్​ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.