వేలాది మందిని రోగాల బారినుంచి కాపాడేందుకే మూసీ ప్రక్షాళన
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ/దేవరకొండ, వెలుగు: మూసీ కారణంగా రోగాల బారిన పడుతున్న వేలాది మందిని రక్షించేందుకు కాంగ్రెస్ సర్కార్ మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. బాధితులకు ఇండ్లు కట్టించి ఇవ్వడంతో పాటు, రూ. 25 వేలు ఇస్తుంటే హరీశ్‌రావు, కేటీఆర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రు వాళ్ల ఫ్యామిలీలతో కలిసి నెల రోజులు మూసీ పక్కన ఉంటే అక్కడి ప్రజల బాధలు తెలుస్తాయని అన్నారు. కేసీఆర్, జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు కలిసి నల్గొండ జిల్లాకు అన్యాయం చేశారని, ఫ్లోరైడ్, మూసీ మురికి కూపం నుంచి ప్రజలను కాపాడేందుకు రూ.30, రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తే తప్పేముందని ప్రశ్నించారు.
నల్గొండ జిల్లా దేవరకొండ, చింతమల్లి మండలం మాల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా జమున మాధవరెడ్డి, దొంతం అళివేలు సంజీవరెడ్డిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. త్వరలోనే నక్కలగండి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నామన్నారు.
రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో ప్రయోజనం లేకుండా పోయిందని, బీఆర్‌ఎస్ సర్కార్ రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే నక్కలగండి పూర్తై దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, కుందూరు జైవీర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు, డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ శంకరర్‌నాయక్ పాల్గొన్నారు.
గత ప్రభుత్వ రుణమాఫీ మిత్తీలకే సరిపోలే..
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేసిన రూ. లక్ష రుణమాఫీ మిత్తీలకే సరిపోలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పడ్డ ప్రభుత్వమన్నారు. 18 వేల మంది రైతులకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేశామని, ఆపైన ఉన్న వారికి కూడా మాఫీ చేస్తామన్నారు. వారంలో అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నామని చెప్పారు.
ఎనిమిది నెలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు నిర్మిస్తామన్నారు. భవిష్యత్‌లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, 15 ఏండ్ల పాటు అధికారంలో ఉంటామన్నారు. 394 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామని, ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారుతాయన్నారు.